తాజా సమాచారం

అందరికీ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు


చైత్ర శుద్ధ పాడ్యమినాడు జరుపుకునే పండుగ ఉగాది. కొత్త జీవితానికి శుభారంభం పలికే సమయం ఉగాది. తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వేడుక ఉగాది. తీయనైన వసంత కోయిల పాట ఉగాది. షడ్రుచుల మేలవింపు మన తెలుగు సంవత్సరాది ఉగాది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది.

"ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ దేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంబించిన రోజు. దీనికి ఆధారం వేదాలను ఆధారం చేసుకొని వ్రాయబడిన "సూర్య సిద్ధాంతం" అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని శ్లోకం

"'చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పధమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తధై వచ'"

అనగా బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం) లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం. అందుకే మొదటి సంవత్సరానికి "ప్రభవ" అని పేరు. చివరి అరవైయ్యొవ సంవత్సరం పేరు "క్షయ" అనగా నాశనం అని అర్ధం. కల్పాంతంలో సృష్టి నాశనమయ్యేది కూడా "క్షయ" సంవత్సరంలోనే. అందుచేతనే చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజును యుగాది అదే ఉగాదిగా నిర్ణయించబడింది.

ఉగాది రోజు నుండి వసంత ఋతువు మొదలవుతుంది. ప్రకృతి ఒక కొత్త రూపాన్ని సంతరించుకొని మళ్ళీ చిగురించి కొత్త కొత్త అందాలతో అలరిస్తుంది. ఉగాది పండగ  అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి, తలంటు స్ధానం, కొత్త బట్టలు.

ఏది ఏమైనా మనందరం గర్వంగా జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఉగాది పండగ ఒకటి అని చెప్ప వచ్చు.

ఉగాది పచ్చడి అసలు పరమార్ధం

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. అనే షడ్రుచులు కలసిన సమ్మేళనం. పచ్చడిని పూజలో నైవేధ్యంగా పెట్టిన తరువాత మనం ప్రసాదంగా స్వీకరించాలి.

  • బెల్లం తీపి ఆనందానికి సంకేతం,
  • ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం.
  • వేప పువ్వు చేదు భాధ కలిగించే అనుభవాలుకు సంకేతం,
  • చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులుకు సంకేతం,
  • పచ్చి మామిడి   పులుపు కొత్త సవాళ్లుకు సంకేతం,
  • మిరపపొడి కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులుకు ఎదురొడ్డటానికి సంకేతం.
  • అంటే మనకు ప్రతి సంవత్సరములో సంభవించే కష్టసుఖాలు, మంచిచెడులు సంయమనంతో స్వీకరించాలనే భావన మన మనసులో కలుగ చేస్తుంది. మానవుడు “ఆపదల్లో కుంగిపోకుండా, సంపదల్లో పొంగిపోకుండా, విజయాలు సాధిస్తున్నప్పుడు ఒదిగి ఉంటూ, వైఫల్యాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడుతూ”  జీవితం సాగించాలని దీని అర్థం.

ప్రకృతికి దూరమౌతోన్న మనిషి తనకు తానే వికృతంగా మారిపోతున్నాడు. ప్రకృతిని ప్రేమిస్తే మనిషి తనను తాను ప్రేమించుకుంటాడు. తనను తాను ప్రేమించుకుంటే ప్రేమ పరమార్ధం అర్ధమౌతుంది. ఇలాంటి అద్భుతమైన భావనను మన సొంతం చేసే ఏకైక పండగ ఉగాది. ఈ ఏడాది శ్రీ విళంబి నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని ఆశిద్దాం.

ఇదే మన రెడ్ స్టార్ యూత్ ఆశ - శ్వాస - అభిలాష.


0 comments:

Post a Comment

My Instagram